ఇంద్రకీలాద్రిపై శ్రీ లలితా త్రిపురసుందరీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం

విజయవాడ, అక్టోబర్ 15: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ఐదో రోజైన గురువారం, ఆశ్వయుజ శుద్ధ పంచమి సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ లలితా త్రిపురసుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

శ్రీ లలితా త్రిపురసుందరీదేవి విశిష్టత

త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తిగా ప్రసిద్ధి చెందారు. దేవీ ఉపాసకులకు ఈ అమ్మవారు ముఖ్య ఆరాధ్య దైవం. శ్రీచక్ర అధిష్ఠాన శక్తిగా కొలువై ఉండే లలితాదేవి విద్యా స్వరూపిణిగా, సమస్త సుఖాలను ప్రసాదించే శక్తి స్వరూపిణిగా భక్తులచే పూజలందుకుంటారు.

చెరుకుగడ, విల్లు, పాశం, అంకుశాలను ధరించి భక్తులకు వరాలు ప్రసాదించే దేవతగా లలితాదేవిని ఆరాధిస్తారు. లక్ష్మీ, సరస్వతీ దేవతలు ఇరువైపులా ఉండగా అమ్మవారు కొలువై ఉంటారని పురాణాలు పేర్కొంటున్నాయి. లలితాదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే విద్య, ఐశ్వర్యం, సుఖసంతోషాలు, మాంగల్య సౌభాగ్యం లభిస్తాయని భక్తుల విశ్వాసం.

పూజా విశేషాలు

లలితాదేవి అనుగ్రహం కోసం సువాసినీ పూజ నిర్వహించడం, వివిధ రకాల పూలతో పాటు కుంకుమతో అమ్మవారిని అర్చించడం విశేషంగా భావిస్తారు. త్రిమూర్తులు, సకల దేవతలు లలితాదేవిని ఆరాధిస్తారని పురాణాలు చెబుతున్నాయి.

నేటి అలంకార విశేషాలు:

  • అలంకారం: శ్రీ లలితా త్రిపురసుందరీదేవి
  • తిథి: ఆశ్వయుజ శుద్ధ పంచమి
  • వారం: గురువారం
  • నైవేద్యం: బెల్లం గారెలు, ఐదు రకాల తీపి పదార్థాలు
  • అలంకరించే చీర రంగు: బంగారు వర్ణం
  • అర్చించే పూలు: వివిధ రకాల పూలు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :