భద్రాచలం పంచాయతీపై వస్తున్న ఆరోపణలు సరికాదు
ప్రభుత్వ ఆదేశాలు, అధికారుల మార్గదర్శకాలు, పంచాయతీ తీర్మానాల ప్రకారమే నిధుల వినియోగం: సర్పంచ్ పూనెం కృష్ణ, ఈవో శ్రీనివాసరావు
భద్రాచలం, నవంబర్ 3:
భద్రాచలం గ్రామపంచాయతీ నిధుల వినియోగంపై ఇటీవల వస్తున్న ఆరోపణలను సర్పంచ్ పూనెం కృష్ణ, కార్యనిర్వహణాధికారి (ఈవో) శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. పంచాయతీకి చెందిన రూ.23 లక్షలను ఉద్యోగి వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు మళ్లించారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలు, అప్పటి కలెక్టర్, ఐటీడీఏ పీఓ మార్గదర్శకాలు, పంచాయతీ తీర్మానాల ప్రకారమే నిధులను వినియోగించినట్లు వెల్లడించారు. వాస్తవాలు తెలుసుకోకుండా పంచాయతీలో అక్రమాలు జరిగాయంటూ ప్రచారం చేయడం తగదని హితవు పలికారు.
ఈ సందర్భంగా ఈవో శ్రీనివాసరావు నిధుల వినియోగానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ.. పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఖజానాలో నిధులు అందుబాటులో లేకపోవడంతో స్థానిక వనరులను వినియోగించి ఎన్నికల ఖర్చులు నిర్వహించాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ గ్రాంటు విడుదలైన అనంతరం అడ్వాన్స్ మొత్తాన్ని తిరిగి జమ చేయాలనే షరతుతో పంచాయతీ తీర్మానం నంబర్ 54 ప్రకారం రూ.9,72,905 వినియోగించినట్లు వివరించారు. పంచాయతీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వంశీ క్యాషియర్ బాధ్యతలు నిర్వహిస్తున్నందున, నిధుల నిర్వహణకు సంబంధించి ఆయన పేరుతో తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవాల నిర్వహణ కోసం అప్పటి ప్రత్యేకాధికారిగా ఉన్న ఐటీడీఏ పీఓ రూ.10 లక్షల అడ్వాన్స్‌కు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. నిధులు అందుబాటులోకి వచ్చేలోపు పంచాయతీ వసూళ్ల నుంచి అత్యవసర పనులు చేపట్టినట్లు వివరించారు. టెండర్లు లేకుండా అత్యవసరంగా నిర్వహించిన పనులకు రూ.11,28,965 ఖర్చు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ మార్గదర్శకాలు, ప్రత్యేకాధికారి ఆమోదం, పంచాయతీ తీర్మానం నంబర్ 12 ప్రకారం జూనియర్ అసిస్టెంట్ వంశీ పేరుతో నిధులు డ్రా చేసి, అనంతరం పంచాయతీ చలానా ద్వారా చెల్లింపులు చేసినట్లు వెల్లడించారు.
రూ.23 లక్షలుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, వాస్తవానికి సంబంధిత మొత్తం రూ.21,41,250 మాత్రమేనని స్పష్టం చేశారు. నిధుల వినియోగానికి సంబంధించిన తీర్మానాలు, చలానాలు, ఖర్చుల రికార్డులు పంచాయతీలో అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి అవకతవకలు జరగలేదని తెలిపారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఎవరైనా వివరాలు తెలుసుకోవచ్చని, అయితే సమాచారాన్ని వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని కోరారు.
అభివృద్ధి లక్ష్యంగా ముందుకు..
సర్పంచ్ పూనెం కృష్ణ మాట్లాడుతూ.. సుదీర్ఘ విరామం తర్వాత భద్రాచలం గ్రామపంచాయతీకి ఎన్నికలు జరిగి ప్రజాపాలకమండలి ఏర్పడిందన్నారు. ‘మన భద్రాచలం.. మన పాలన.. మన అభివృద్ధి’ అనే నినాదంతో పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి కోసం ముందడుగు వేస్తున్న సమయంలో నిరాధార ఆరోపణల వల్ల పాలనకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో పాలకమండలి లేని సమయంలో అధికారులు తీసుకున్న నిర్ణయాలు, జారీ చేసిన సర్క్యులర్లు, మార్గదర్శకాలను ప్రస్తుత పాలకమండలి కూడా అనుసరించాల్సి ఉంటుందని వివరించారు. ఇంటి పన్నుల రూపంలో వసూలైన ఆదాయం ప్రభుత్వ ఖాతాలకు వెళ్లడంతో పంచాయతీలో నిధుల కొరత ఏర్పడేదని, ఎన్నికలు, ఉత్సవాల నిర్వహణకు అప్పటి కలెక్టర్, ఐటీడీఏ పీఓ ఆదేశాల మేరకు నిధులు వినియోగించినట్లు తెలిపారు.
పంచాయతీ వ్యవహారాలపై ఎవరికైనా సందేహాలు ఉంటే నేరుగా అడిగి తెలుసుకోవచ్చని, ప్రతి అంశంపై సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఒకే అంశంపై పదేపదే దరఖాస్తులు చేయడం వల్ల పరిపాలనా పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. సమాచారాన్ని తెలుసుకోవడం తప్పు కాదని, దానిని వక్రీకరించి ఆరోపణలు చేయడం వల్ల అభివృద్ధి పనులపై ప్రభావం పడుతుందని అన్నారు.
భద్రాచలం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు..
దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన భద్రాచలాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సర్పంచ్ పేర్కొన్నారు. రాబోయే జాతీయస్థాయి ఉత్సవాలు, దేవస్థానం అభివృద్ధి, పర్యాటక రంగానికి సంబంధించి పలు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాచలం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, ఐటీడీఏ రోడ్డు, చర్ల రోడ్డు సహా ప్రధాన రహదారుల విస్తరణకు సూచనలు చేసినట్లు వెల్లడించారు.
పంచాయతీకి సాధారణంగా వచ్చే నిధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం, మంత్రుల సహకారంతో అదనపు నిధులు సమీకరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. గతంలో పాలకమండలి లేకపోవడంతో ముందుకు సాగని పలు అభివృద్ధి ప్రతిపాదనలను ఇప్పుడు ప్రభుత్వానికి పంపించే అవకాశం ఏర్పడిందన్నారు. కొత్త మార్కెట్ ప్రాంతంలో ఆధునిక కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టామని, పనులు కూడా ప్రారంభమైనట్లు వివరించారు. మంత్రి సూచనల మేరకు రానున్న 15 రోజుల్లో కొన్ని అభివృద్ధి పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు.
పంచాయతీ ఆదాయం పెంపునకు చర్యలు..
పంచాయతీ ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని పూనెం కృష్ణ తెలిపారు. లాడ్జీలు, ఇతర పంచాయతీ ఆస్తులను అభివృద్ధి చేసి ఆదాయ వనరులను పెంచుకోవాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ నిధులతోపాటు స్థానిక ఆదాయాన్ని సమర్థంగా వినియోగించుకుంటే మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టవచ్చన్నారు. సీఎస్ఆర్ నిధుల సమీకరణకు కూడా ప్రయత్నిస్తున్నామని, పట్టణంలో ప్రధాన సమస్యలుగా ఉన్న డ్రైనేజీ, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల మెరుగుదలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
కొత్తగా ఏర్పడిన పాలకమండలి పంచాయతీరాజ్ చట్టం, పరిపాలనా అంశాలపై అవగాహన పెంచుకుంటూ అధికారులు, వార్డు సభ్యుల సహకారంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తోందన్నారు. పాలనలో ఏవైనా పొరపాట్లు జరిగితే సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజల సూచనలు, సలహాలను స్వీకరిస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సాధ్యమైనంత వరకు అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
భద్రాచలం అభివృద్ధిని రాజకీయాలకు, వ్యక్తిగత ఆరోపణలకు అతీతంగా చూడాలని సర్పంచ్ పూనెం కృష్ణ, ఈవో శ్రీనివాసరావు కోరారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులు సమన్వయంతో ముందుకు వస్తే భద్రాచలాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చని పేర్కొన్నారు. ‘మన భద్రాచలం.. మన పాలన.. మన అభివృద్ధి’ లక్ష్యంతో అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.








