# ఇచ్చోడలో జోడోయాత్ర రెండో రోజు.. కొమురం భీమ్‌కు ఘన నివాళ
**డిసెంబర్ 9 చలో మానుకోట సాంస్కృతిక ధర్మయుద్ధం సభ విజయవంతానికి ‘జోడ కబురు’ పత్రిక విడుదల
**ఇచ్చోడ, నవంబర్ 2:** ఆదివాసీ 9 తెగల అస్తిత్వం, హక్కుల పరిరక్షణ లక్ష్యంగా చేపట్టిన జోడోయాత్ర రెండో రోజు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం డిసెంబర్ 9న మానుకోటలో నిర్వహించనున్న ఆదివాసీ 9 తెగల సాంస్కృతిక ధర్మయుద్ధం బహిరంగ సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా రూపొందించిన **‘జోడ కబురు’ పత్రికను** విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ సమన్వయకర్త **కొడప కోసురావు దాదా**, తోటి నాయకులు **కాట్ల విఠల్, మర్సకోల సుంగు, తోటి పవన్** పాల్గొన్నారు. వారి సమక్షంలో 9 తెగల జేఏసీ చైర్మన్ **చుంచు రామకృష్ణ**, తుడుందెబ్బ ఉపాధ్యక్షుడు **అలెం కోటి**, జోడోయాత్ర బృందం సభ్యులు కలిసి ‘జోడ కబురు’ పత్రికను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. డిసెంబర్ 9న మానుకోట గడ్డపై నిర్వహించనున్న సాంస్కృతిక ధర్మయుద్ధం బహిరంగ సభకు ఆదివాసీ ప్రజలు, యువత, విద్యార్థులు, వివిధ ప్రాంతాల ఆదివాసీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కొమురం భీమ్ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఆదివాసీ 9 తెగల ఐక్యత, అస్తిత్వం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం జోడోయాత్ర ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఆదివాసీ సమాజంలో చైతన్యం తీసుకురావడం, ఐక్యతను బలోపేతం చేయడం, డిసెంబర్ 9 సభ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని తెలిపారు.








