భద్రాచలం, నవంబర్ 11: భద్రాచలం పట్టణం, పరిసర ప్రాంతాల్లో అక్రమ మద్యం విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయని, కొందరు మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం నిర్వహిస్తున్నారని రోటరీ క్లబ్ అధ్యక్షుడు, సామాజికవేత్త ఎస్.కె. అజీమ్ ఆరోపించారు. ఈ అక్రమ విక్రయాలను అరికట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం భద్రాచలం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సీఐకి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా అజీమ్ మాట్లాడుతూ.. భద్రాచలం మండల పరిధిలో ప్రభుత్వం అనుమతించిన మద్యం దుకాణాల నిర్వాహకుల్లో కొందరు సిండికేట్‌గా ఏర్పడి అక్రమ మద్యం విక్రయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఐటీడీఏ రోడ్డులోని శివాలయం ఎదురుగా ఉన్న మద్యం దుకాణం వెనుక ప్రత్యేకంగా షట్టర్ ఏర్పాటు చేసి, అక్కడి నుంచి అనధికారికంగా మద్యం విక్రయాలు సాగిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంతేకాకుండా పట్టణంలోని కిరాణా దుకాణాలు, కూల్‌డ్రింక్స్ షాపులు, పాన్ డబ్బాలు, ఆర్అండ్బీ రోడ్డు పక్కన ఉన్న కొన్ని ఇళ్ల ద్వారా కూడా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ అక్రమ మద్యం వ్యాపారాన్ని విస్తరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు భిన్నంగా ఒక్కో క్వార్టర్ బాటిల్‌పై రూ.20 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని, ఈ విధమైన అక్రమ విక్రయాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడటంతో పాటు వినియోగదారులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అక్రమ వ్యాపారంపై సమగ్ర విచారణ చేపట్టి, అనుమతులకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
వినతిపత్రంపై స్పందించిన ఎక్సైజ్ సీఐ అక్రమ మద్యం విక్రయాలపై తగిన విచారణ జరిపి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు అజీమ్ తెలిపారు.








