నవంబర్ 08 (SD TV తెలుగు): దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేశవపురం–జగన్నాధపురం గ్రామంలోని శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మగుడి) భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం ఉదయం నుంచే పరిసర గ్రామాలతో పాటు జిల్లా నలుమూలల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పెద్దమ్మతల్లిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అన్నప్రాశనలు, వాహన పూజలు, తలనీలాలు, అమ్మవారికి ఒడిబియ్యం, చీరలు, కనుములు తదితర మొక్కులు సమర్పించి అమ్మవారిని, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ ఎ. విజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఆలయ సిబ్బంది ప్రత్యేక దర్శన క్యూలైన్లు, ఉచిత పులిహోర ప్రసాద వితరణ, తాగునీటి సౌకర్యం, అన్నదానం తదితర ఏర్పాట్లు చేపట్టి పర్యవేక్షించారు.
దీపావళి పర్వదినం సందర్భంగా పెద్దమ్మతల్లి ఆలయం భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.








