టీఆర్ఎస్ (డి) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా డా. బూసిరెడ్డి శంకర్ రెడ్డి నియామక
ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా కూడా బాధ్యతలు – నియామక ఉత్తర్వులు జారీ చేసిన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నరాల సత్యనారాయణ
తెలంగాణ రక్షణ సమితి (డి) పార్టీ రాష్ట్ర నిర్మాణంలో భాగంగా ప్రముఖ సీనియర్ రాజకీయ నాయకులు, సామాజిక సేవకులు డాక్టర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది. పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఆయనను నియమిస్తూ టీఆర్ఎస్ (డి) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ నరాల సత్యనారాయణ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా నరాల సత్యనారాయణ మాట్లాడుతూ.. డాక్టర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి సీనియర్ రాజకీయ నాయకుడిగా, పేదల పెన్నిధిగా, సేవా తత్పరుడిగా, ప్రముఖ సమాజ సేవకుడిగా గుర్తింపు పొందారని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు విస్తృత పరిచయాలు ఉన్నాయని పేర్కొన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో రోటరీ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్గా విశిష్ట సేవలు అందించారని, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం రాజకీయ ప్రస్థానం కొనసాగించారని వివరించారు.
తెలంగాణ రక్షణ సమితి (డి) పార్టీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, కార్యకర్తల సమన్వయం, పార్టీ కార్యక్రమాల నిర్వహణలో డాక్టర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తారని నరాల సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు.
అలాగే నల్గొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డాక్టర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటుతో విజయం సాధించి, టీఆర్ఎస్ (డి) పార్టీ తరఫున శాసనమండలికి వెళ్లడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి ప్రజా సంఘాలు, లెక్చరర్ల సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, న్యాయవాదుల సంఘాలు పూర్తి మద్దతు ప్రకటించాయని తెలిపారు.
పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రజలకు మరియు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని డాక్టర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డికి సూచించారు.








