రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా 11వ తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ
180 మంది ఎన్సీసీ క్యాడెట్లతో ఘనంగా 97వ ఎడిషన్ ‘సైకిల్స్ ఆన్ సండే’ కార్యక్రమం
కొత్తగూడెం, నవంబర్ 3:
భారత ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా దేశ సమగ్రత, ఐక్యత, సోదరభావం, జాతీయ సమైక్యతా స్ఫూర్తిని ప్రజల్లో పెంపొందించాలనే లక్ష్యంతో 11వ తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు.
కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎస్.కె. సంజయ్ భద్ర నేతృత్వంలో 97వ ఎడిషన్ ‘సైకిల్స్ ఆన్ సండే’ కార్యక్రమంలో భాగంగా ఈ ర్యాలీ నిర్వహించారు. సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ జి. రాజేంద్రప్రసాద్, కరస్పాండెంట్ పి. కాంతారావు పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించడంతో పాటు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బెటాలియన్ తరఫున సుబేదార్ మేజర్ బాల్ బహదూర్ పున్, జేసీవోలు పాషా, షఫీ తదితరులు ర్యాలీ నిర్వహణలో పాల్గొన్నారు. ప్రతిజ్ఞ అనంతరం ప్రకాశం స్టేడియం నుంచి ప్రారంభమైన సైకిల్ ర్యాలీ కొత్తగూడెం బస్టాండ్ వరకు కొనసాగింది.
ఆదివారం నిర్వహించే ‘సైకిల్స్ ఆన్ సండే’ కార్యక్రమం ద్వారా ప్రజలు సైక్లింగ్‌ను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని నిర్వాహకులు అవగాహన కల్పించారు. వాహనాల వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని సూచించారు. సైక్లింగ్ వల్ల శారీరక దృఢత్వం పెరగడంతో పాటు ఇంధన పొదుపు, వాయు కాలుష్య నియంత్రణ సాధ్యమవుతాయని సందేశాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు కె. శ్రీలత, మహేందర్, ప్రశాంత్, రాజ్‌మోహన్, పీఐ స్టాఫ్ రుచిత, కేర్టేకర్లు పవన్ కళ్యాణ్, వినోద్, ధర్మారావు పాల్గొన్నారు.
అలాగే డీఏవీ పాల్వంచ, నవభారత్ పాల్వంచ, టీజీటీఎంఆర్ఎస్ కొత్తగూడెం, కేఎల్ఆర్ పాల్వంచ ఇంజనీరింగ్ కళాశాల, ఎస్‌సీహెచ్‌ఎస్ కొత్తగూడెం, టీటీడబ్ల్యూఆర్డీసీ కొత్తగూడెం, ఎస్ఆర్ఏఎస్ కొత్తగూడెం, ఎస్సీడబ్ల్యూడీసీ కొత్తగూడెం, జీడీసీ పాల్వంచ తదితర తొమ్మిది విద్యాసంస్థలకు చెందిన మొత్తం 180 మంది ఎన్సీసీ క్యాడెట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.
దేశ ఐక్యతా భావాన్ని పెంపొందించడంతో పాటు ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.








