పెద్దమ్మతల్లిని అధిక సంఖ్యలో దర్శించుకున్న భక్తులు

ఆదివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన పెద్దమ్మగుడి.. బోనాలు, ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మిక సందడి

పాల్వంచ, నవంబర్ 1:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేశవాపురం–జగన్నాధపురం గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మగుడి) ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వారాంతపు సెలవు, ఆదివారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

ఉదయం నుంచే పరిసర గ్రామాలతో పాటు జిల్లా నలుమూలల నుంచి, ఇతర జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని పెద్దమ్మతల్లిని దర్శించుకున్నారు. అమ్మవారి కృప తమ కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా దేవస్థాన ఆవరణలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అన్నప్రసాదాలు, వాహన పూజలు, తలనీలాలు, అమ్మవారికి ఒడిబియ్యం, చీరలు, కనుములు తదితర మొక్కులు సమర్పించారు. అనంతరం అమ్మవారిని, స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు ప్రత్యేక దర్శనానికి క్యూ లైన్లు, ఉచిత పులిహోర ప్రసాద వితరణ, మంచినీటి సౌకర్యం, అన్నదానం తదితర ఏర్పాట్లు చేశారు. భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ ఎ. విజయకుమార్ పర్యవేక్షించారు.

ఆదివారం కావడంతో పెద్దమ్మగుడి పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :