డిసెంబర్ 9న మానుకోటలో బహిరంగ సభ.. కురవి ఆలయంలో ప్రత్యేక పూజలు, పోస్టర్ ఆవిష్కరణ

కురవి వీరన్న సాక్షిగా ఆదివాసీ 9 తెగల సాంస్కృతిక ధర్మయుద్ధానికి శంఖారావం!

 

డిసెంబర్ 9న మానుకోటలో బహిరంగ సభ.. కురవి ఆలయంలో ప్రత్యేక పూజలు, పోస్టర్ ఆవిష్కర

కురవి, అక్టోబర్ 30: ఆదివాసీ 9 తెగల ఐక్యత, అస్తిత్వం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణే లక్ష్యంగా డిసెంబర్ 9న మానుకోట గడ్డపై నిర్వహించనున్న తుడుందెబ్బ మోగిస్తున్న ఆదివాసీ 9 తెగల సాంస్కృతిక ధర్మయుద్ధం బహిరంగ సభకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదివాసీ 9 తెగల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ చుంచు రామకృష్ణ డీఈ ఆధ్వర్యంలో శుక్రవారం కురవి గ్రామంలోని శ్రీ భద్రకాళీ సమేత కురవి వీరన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాబోయే బహిరంగ సభ విజయవంతం కావాలని స్వామివారిని ప్రార్థించి మొక్కులు సమర్పించారు. అనంతరం ఆధార్ సొసైటీ, తుడుందెబ్బ, కుమ్రం భీమ్ యూత్ ఫర్ కమ్యూనిటీ సభ్యుల చేతుల మీదుగా సభకు సంబంధించిన ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఆదివాసీ సమాజంలోని తొమ్మిది తెగలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఐక్యతా భావాన్ని బలోపేతం చేయడం, తరతరాలుగా వస్తున్న ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, భాషా వైవిధ్యాన్ని కాపాడుకోవడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశంగా నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఆదివాసీల సామాజిక అస్తిత్వం, స్వాభిమానం, హక్కులు, భూమి, అటవీ వనరుల పరిరక్షణ వంటి అంశాలపై సమాజంలో విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని, అందుకు సంఘటిత కార్యాచరణ అవసరమని వారు భావిస్తున్నారు.

ఈ క్రమంలో డిసెంబర్ 9న మానుకోటలో నిర్వహించనున్న బహిరంగ సభను కేవలం ఒక సమావేశంగా కాకుండా ఆదివాసీ తెగల ఐక్యతను చాటే సాంస్కృతిక వేదికగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘తుడుందెబ్బ’ నినాదంతో ఆదివాసీ యువతలో చైతన్యం తీసుకురావడంతో పాటు, తమ మూలాలు, వారసత్వం, సంప్రదాయాల పట్ల భావితరాలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వివిధ ప్రాంతాల్లోని ఆదివాసీ సంఘాలు, కుల పెద్దలు, యువజన సంఘాలు, సామాజిక సంస్థల ప్రతినిధులను భాగస్వాములను చేసి సభను విజయవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఖమ్మం పట్టణ పెద్దలు, ఆధార్ సొసైటీ ఉపాధ్యక్షులు మూతి భాస్కర్ రావు, కురసం సీతారాములు, AEWCA నాయకులు జెజ్జరి జానకీరామ్, తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు అలెం కోటి, జిల్లా నాయకులు ఉండం శ్రీను, కల్తి నర్సయ్య, ఎట్టి కిరణ్ పాల్గొన్నారు. అలాగే బయ్యారం మండల తుడుందెబ్బ నాయకులు, కుల పెద్దలు చాట్ల వెంకన్న, మెస్సు రాజశేఖర్, చుంచు ముత్తయ్య, రాజు, బట్ట శ్రీకాంత్, అరుణ్, వజ్జా రవితేజతో పాటు ఇల్లందు మండల తుడుందెబ్బ నాయకులు ముక్తి కోటేశ్వరరావు, జబ్బ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కురవి వీరన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలతో ప్రారంభమైన ఈ ప్రచార కార్యక్రమం ద్వారా డిసెంబర్ 9న మానుకోటలో జరిగే ఆదివాసీ 9 తెగల సాంస్కృతిక ధర్మయుద్ధం బహిరంగ సభకు విస్తృత ప్రచారం కల్పించాలని నాయకులు నిర్ణయించారు. ఆదివాసీ సమాజ ఐక్యత, అస్తిత్వం, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ అంశాలపై ఈ సభలో ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :