భద్రాచలం రాజుపేట కాలనీలో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌.. 150 కేసులు నమోదు

భద్రాచలం, అక్టోబర్ 25: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం తెల్లవారుజామున రాజుపేట కాలనీలో పోలీసులు కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 42 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలు, నంబర్ ప్లేట్లు లేని మరో 8 వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం 150 కేసులు నమోదు చేసి రూ.36,390 జరిమానా విధించారు.

మత్తు పదార్థాలపై కఠిన చర్యలు

కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమంలో భాగంగా కాలనీవాసులతో మాట్లాడిన డీఎస్పీ అరుణ్ కుమార్ గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం, విక్రయం, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి వినియోగానికి బానిసైన వారిని గుర్తించి డీ-అడిక్షన్ కేంద్రాలకు తరలించే విషయంలో పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు. కాలనీల్లో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ట్రాఫిక్, సైబర్ నేరాలపై అవగాహన

వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డీఎస్పీ స్పష్టం చేశారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, యూపీఐ పిన్‌లను ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి సమాచారాన్ని పోలీసులకు అందించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో సహకరించాలని కాలనీవాసులకు విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ లక్ష్యంగా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో సీఐ రాజు, వెంకటప్పయ్య, పోలీసు అధికారులు, సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, డాగ్ స్క్వాడ్ బృందం తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :