డిసెంబర్ 9న ఆదివాసీ సాంస్కృతిక ధర్మయుద్ధానికి తరలిరావాలని పిలుపు
మర్రిగూడెం, అక్టోబర్ 17: బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మర్రిగూడెం గ్రామంలో ఆదివాసీ మహిళలు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదివాసీ 9 తెగల జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ణ, తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలం కోటి పాల్గొన్నారు. ఆదివాసీ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడి వారిలో ఉత్సాహాన్ని నింపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, అస్తిత్వం, హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 9న నిర్వహించనున్న ఆదివాసీ సాంస్కృతిక ధర్మయుద్ధానికి ఆదివాసీ మహిళలు, యువత, పెద్దలు, తొమ్మిది తెగల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
మర్రిగూడెంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు ఆదివాసీ మహిళల ఉత్సాహాన్ని, సంప్రదాయాల పట్ల వారికున్న అభిమానాన్ని చాటిచెప్పాయి.









