తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా? రావొద్దనడానికి మీరెవరు: పవన్ కల్యాణ్

  • తెలంగాణలో ఇకపై జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటన
  • బెదిరింపులకు, హెచ్చరికలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టీకరణ
  • చెరువు కబ్జా ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్

తెలంగాణ గడ్డతో తనకు రాజకీయాలకు అతీతమైన అనుబంధం ఉందని, ఈ ప్రాంతంపై ఎనలేని ప్రేమ ఉందని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. తనపై కొందరు చేస్తున్న విమర్శలు, బెదిరింపుల నేపథ్యంలో ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఘాటుగా స్పందించారు. ఇకపై తెలంగాణలో జరిగే ఎన్నికల్లో జనసేన పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుందని సంచలన ప్రకటన చేశారు. ఈ నిర్ణయంతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరలేపారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, “హైదరాబాద్‌లో ఎలా అడుగు పెడతావని, ఇక్కడ నీకేం పని అని కొందరు నన్ను ప్రశ్నిస్తున్నారు. దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ఏమైనా వాళ్ల అయ్య జాగీరా? ఇలాంటి బెదిరింపులకు భయపడే వ్యక్తిని నేను కాదు,” అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో తనను తిరగనివ్వబోమని బెదిరించినప్పుడు, తన ‘వారాహి’ వాహనానికి అనుమతులు ఇచ్చి అండగా నిలబడింది తెలంగాణ సమాజమేనని ఆయన గుర్తుచేశారు. జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణ నడిబొడ్డున అని, ఈ గడ్డ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తనకు ఉందని స్పష్టం చేశారు.. “హైదరాబాద్‌లో నేను ఒక చెరువును కబ్జా చేశానని ఆరోపిస్తున్నారు. నేను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ భూమిని పరిశీలించండి. నేను కబ్జా చేశానని నిరూపణ అయితే, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకోవచ్చు. నాపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు” అని బహిరంగ సవాల్ విసిరారు. తనకు అధికారం మీద ఆశ లేదని, ఏపీలోనే తాను అధికారాన్ని ఆశించలేదని, అలాంటిది తెలంగాణలో ఎందుకు ఆశిస్తానని ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ చేయాలని క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు ఎప్పటినుంచో కోరుతున్నారని “ఇన్నాళ్లూ ఓపిక పట్టాం. ఇకపై ఊరుకునేది లేదు. నేనే స్వయంగా తెలంగాణ అంతటా పర్యటిస్తాను. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుంది. ఎవరు ఏం చేసుకుంటారో చూసుకోండి” అంటూ తన రాజకీయ ప్రత్యర్థులకు గట్టి హెచ్చరిక జారీ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :