- జయశంకర్ విగ్రహ ప్రతిష్ఠాపనపై జాగృతి ప్రతిపాదన
- ఆగస్టు 6 నాటికి విగ్రహ ఏర్పాటు పూర్తి కావాలి
- ట్యాంక్ బండ్ వద్ద స్థలాన్ని సూచించిన కవిత
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం, ఇక్కడి ప్రజల సమస్యల పరిష్కారం కోసం తన జీవితాంతం ఉద్యమ భావజాల వ్యాప్తి చేసిన మహోన్నత దార్శనికుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్‌కు హైదరాబాద్‌లో తగిన గౌరవం దక్కడం లేదనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో, సాంస్కృతిక పునరుజ్జీవనంలో గత రెండు దశాబ్దాలుగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సామాజిక సంస్థ తెలంగాణ జాగృతి ఈ అంశంపై స్పందించింది. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ట్యాంక్ బండ్‌పై జయశంకర్ సార్ కాంస్య విగ్రహాన్ని అధికారికంగా ప్రతిష్టించడానికి అనుమతినివ్వాలని కోరుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు.మహనీయులను గౌరవించుకోవడం అంటే మన చరిత్రను మనం గౌరవించుకోవడమేనని అందుకే జయశంకర్ సార్ విగ్రహం హైదరాబాద్‌లో కొలువుదీరటం ఒక చారిత్రక అవసరమని లేఖలో స్పష్టం చేశారు. ట్యాంకుబండ్‌పై ప్రస్తుతం యుద్ధ ట్యాంకర్ ఉంచిన స్థలానికి పక్కన ఉన్న ప్రాంగణం ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహ ఏర్పాటుకు అత్యంత సముచితమైనదిగా తెలంగాణ జాగృతి ప్రతిపాదించింది. ఈ విగ్రహ స్థాపనకు అయ్యే పూర్తి నిధులను ప్రభుత్వ రూపాయి సహాయం లేకుండా తమ సంస్థే పూర్తిగా భరిస్తుందని కవిత స్పష్టం చేశారు.









