తెలంగాణలోని నిరుద్యోగులకు TGSPSC శుభవార్త చెప్పింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో అటవీ శాఖలోనే 3 వేలకుపైగా ఖాళీలు ఉన్నాయని తెలిపింది. అదే సమయంలో ఈనెలలోనే మరిన్ని నోటిఫికేషన్లను కూడా రిలీజ్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక ఉద్యోగాలను ఓఎంఆర్‌లో కాకుండా సీబీటీ విధానంలోనే నిర్వహిస్తామని టీజీపీఎస్సీ తేల్చి చెప్పింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన నిరుద్యోగులకు శుభవార్త చెప్పేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) రెడీ అయింది. ఈ నేపథ్యంలోనే రేపు ఒక్కరోజే 3 రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తాజాగా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియలో వేగాన్ని పెంచడంతో పాటు.. ఎలాంటి అవకతవకలు లేకుండా పరీక్షల నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3,800 ఖాళీ పోస్టుల భర్తీకి అనుమతులు వచ్చినట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్ వెల్లడించారు. ఇందులో అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 3,093 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇక వివిధ శాఖల్లో ఒక్కో పోస్ట్ చొప్పున 25 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం ఇక నుంచి రెగ్యులర్‌గా నోటిఫికేషన్లను టీజీపీఎస్సీ విడుదల చేస్తుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ప్రతీ నెల సగటున 3 నోటిఫికేషన్లను జారీ చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు 3 కొత్త నోటిఫికేషన్లను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు.
Post Views: 67









