విప్లవ స్ఫూర్తితో జీవితాంతం పోరాడిన మంజుల

 

కొత్తగూడెం, అక్టోబర్ 28: అట్టడుగు దళిత కుటుంబంలో జన్మించి, ఉద్యమాల సహకారంతో ఉన్నత విద్యను అభ్యసించిన కామ్రేడ్ జాడి మంజుల విద్యార్థి, మహిళా, ప్రజా ఉద్యమాల్లో స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించారని ప్రగతిశీల మహిళా సంఘం (POW) జాతీయ నాయకురాలు వి. సంధ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే. సాబీర్ పాషా, సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు కొనియాడారు. కేవలం 37 ఏళ్ల వయసులోనే ఆమె మరణించడం విప్లవ, ప్రగతిశీల ఉద్యమాలకు తీరని లోటని పేర్కొంటూ ఘనంగా నివాళులర్పించారు.

సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నగర కమిటీ సభ్యురాలు కామ్రేడ్ జాడి మంజుల సంతాప సభను కొత్తగూడెంలోని ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సభకు న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన గుండాల మండలం లింగగూడెంలో మంజుల జన్మించారని తెలిపారు. కుటుంబంలో విద్యావంతులు లేకపోయినా, ఉద్యమాల సహకారంతో ఉన్నత విద్యను అభ్యసించి, విద్యార్థి సంఘం పీడీఎస్‌యూ నాయకురాలిగా ఎదిగారని గుర్తుచేశారు. రాష్ట్రస్థాయి నాయకత్వ బాధ్యతలు నిర్వహించడంతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని పేర్కొన్నారు.

మహిళా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ, కొత్తగూడెం ప్రజలకు సుపరిచితురాలిగా నిలిచారని అన్నారు. ఉద్యమ ప్రస్థానంలో అనేక కేసులు, నిర్బంధాలను ఎదుర్కొన్నారని, 2014లో ఆళ్లపల్లి పోలీసులు నమోదు చేసిన ఉపా కేసులోనూ ఆమె పేరు ఉందని గుర్తుచేశారు. ధైర్యసాహసాలు, అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం మంజులకు చిన్ననాటి నుంచే అలవడ్డాయని, ఆమె జీవితం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.

దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చిన్న వయసులోనే మంజుల కన్నుమూయడం పట్ల నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మరణం కమ్యూనిస్టు, ప్రగతిశీల, విప్లవ ఉద్యమాలకు తీరని నష్టమని అన్నారు. మంజులకు నివాళులర్పించడం అంటే ప్రజా ఉద్యమాల్లో ఆమె నిర్వహించిన సాహసోపేతమైన పాత్రను కొనసాగించేందుకు కృషి చేయడమేనని పిలుపునిచ్చారు.

ఈ సంతాప సభలో పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు సింగ ఉపేందర్ రావు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జి. అనురాధ, జర్నలిస్ట్ ఎస్‌ఎల్. ముత్యం, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడు గణేష్, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు చంద్రారెడ్డి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి అశోక్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఆది లక్ష్మి, మాస్‌లైన్ రాష్ట్ర నాయకులు ఆవుల అశోక్, కండె లక్ష్మీనారాయణ, చార్వాక, పీడీఎస్‌యూ నాయకులు పృథ్వీ, సాంబ, గణేష్, ప్రణయ్, రాములమ్మతో పాటు కుటుంబ సభ్యులు జంపన్న, పూలే, లత, రజిత తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :