వేలాదిగా తరలివచ్చిన భక్తులు.. ప్రత్యేక పూజలు, భజనలు, కోలాటాలతో ఆధ్యాత్మిక శోభ
ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 26: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆశ్వయుజ పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం ఉదయం గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లతో పాటు ఇంద్రకీలాద్రిపై కొలువైన సకల దేవతలను స్మరిస్తూ వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొని అమ్మవారిని, స్వామివారిని దర్శించుకున్నారు.
ఘాట్ రోడ్డు ప్రవేశద్వారం వద్ద ఉన్న శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్చారణలు, భజన సంకీర్తనలు, సంప్రదాయ కోలాట ప్రదర్శనల మధ్య భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలో ముందుకు సాగారు.
భక్తులకు ఆధ్యాత్మిక స్వాగతం
గిరి ప్రదక్షిణ మార్గంలో పలు ప్రాంతాల్లో స్థానిక మహిళలు రహదారులను పసుపు నీటితో శుద్ధి చేసి, హారతులు సమర్పించి, కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి స్వాగతం పలికారు. జయజయధ్వానాలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ మార్గమంతా అమ్మవారి కుంకుమ, ప్రసాదాన్ని పంపిణీ చేశారు. పౌర్ణమి రోజున ఇంద్రకీలాద్రి చుట్టూ ప్రదక్షిణ చేయడం విశేష పుణ్యఫలదాయకమని భక్తుల విశ్వాసం.
పలు ప్రాంతాల మీదుగా గిరి ప్రదక్షిణ
ఘాట్ రోడ్డులోని శ్రీ అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి మీదుగా తిరిగి ఇంద్రకీలాద్రికి చేరుకునేలా నిర్ణయించిన మార్గంలో కొనసాగింది.
ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో కిషోర్ కుమార్, సూపరింటెండెంట్ హేమ దుర్గాంబ, సీనియర్ అసిస్టెంట్ శిరీష తదితర అధికారులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో ఇంద్రకీలాద్రి పరిసరాలు భక్తి పారవశ్యంతో మార్మోగాయి.









