వ్యాపారుల హక్కుల పరిరక్షణే లక్ష్యం.. శ్రీ సీతారామ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటన

రికార్డు స్థాయిలో 1,120 మంది సభ్యుల నమోదు.. నవంబర్‌లో ఎన్నికలకు సన్నాహాలు

భద్రాచలం: వ్యాపారుల హక్కుల పరిరక్షణ, వ్యాపార వర్గాల సంక్షేమం, సంస్థలో పారదర్శకతే ప్రధాన లక్ష్యంగా శ్రీ సీతారామ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పనిచేస్తోందని కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. భద్రాచలంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చాంబర్ పునర్నిర్మాణం, సభ్యత్వ నమోదు, ఎన్నికల నిర్వహణ, ఆర్థిక లావాదేవీల పారదర్శకతపై వారు వివరించారు.

చాంబర్ పునర్నిర్మాణంలో భాగంగా 12 మంది సభ్యులతో తాత్కాలిక (అడ్‌హాక్) కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత ఎనిమిది నెలలుగా సంస్థ అభివృద్ధికి కృషి చేస్తూ, వ్యాపారుల ప్రయోజనాల పరిరక్షణకు పలు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. సంస్థకు చట్టబద్ధమైన గుర్తింపు కల్పించడంతోపాటు, ఎన్నికల నిర్వహణకు వీలుగా ‘శ్రీ సీతారామ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ పేరుతో అధికారిక రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు వెల్లడించారు.

రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు

సంస్థలో ప్రజాస్వామ్య విధానాన్ని పునరుద్ధరించేందుకు ఎన్నికల కమిటీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రతినిధులు తెలిపారు. తక్కువ వ్యవధిలోనే 1,120 మంది వ్యాపారులను సభ్యులుగా నమోదు చేయడం విశేషమని పేర్కొన్నారు. వ్యాపారుల నుంచి లభిస్తున్న స్పందన సంస్థపై వారికి ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందన్నారు.

నవంబర్‌లో ఎన్నికలు

చాంబర్‌కు సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించడంతోపాటు, సంస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా రాబోయే నవంబర్‌లో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. వ్యాపారుల భాగస్వామ్యంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకతకు ప్రాధాన్యం

సంస్థకు సంబంధించిన ప్రతి రూపాయికి లెక్కలు నిర్వహిస్తూ ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత పాటిస్తామని కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. సంస్థ ఆర్థిక నివేదికను మీడియా ముందు వెల్లడించనున్నట్లు తెలిపారు. చాంబర్‌కు అనుబంధంగా ఉన్న 18 వ్యాపార శాఖల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని, వ్యాపారుల హక్కుల పరిరక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

వ్యాపారుల ఐక్యత, సంక్షేమం, సంస్థాగత అభివృద్ధి కోసం సమష్టిగా ముందుకు సాగుతామని శ్రీ సీతారామ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ ప్రతినిధులు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :