కొత్తపేటలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు…

ఆదివాసీ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన 9 తెగల జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ణ

బయ్యారం, అక్టోబర్ 19: బయ్యారం మండలంలోని కొత్తపేట గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఆదివాసీ మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పూల పండుగ వేడుకలు ఆటపాటలు, సంప్రదాయ నృత్యాలతో గ్రామంలో పండుగ వాతావరణాన్ని నింపాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదివాసీ 9 తెగల జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ణ హాజరయ్యారు. ఆయనకు ఆదివాసీ మహిళలు, యువత ఘనస్వాగతం పలికారు. అనంతరం కొమరం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి మహిళలతో కలిసి ర్యాలీగా బతుకమ్మ వేడుకలు నిర్వహించే ప్రదేశానికి చేరుకున్నారు.

అనంతరం సమ్మక్క–సారలమ్మ గద్దల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆదివాసీ సంప్రదాయాలను స్మరించుకున్నారు. బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న చుంచు రామకృష్ణ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి సందడి చేశారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా చుంచు రామకృష్ణ మాట్లాడుతూ ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న అణచివేత, అన్యాయాల గురించి మహిళలకు వివరించారు. ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ అవగాహనతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఆదివాసీ మహిళల పాత్ర ఎంతో కీలకమని, తమ హక్కులపై అవగాహన పెంచుకుని ఐక్యంగా ఉండాలని సూచించారు.

సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా కొత్తపేటలో ఆదివాసీ మహిళలు, యువత ఉత్సాహంగా పాల్గొనడంతో గ్రామంలో పండుగ సందడి నెలకొంది. సంప్రదాయాలను కాపాడుకుంటూ, సామాజిక ఐక్యతను చాటుతూ నిర్వహించిన ఈ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :