కొత్తగూడెం కలెక్టరేట్‌లో ఘనంగా టీజీవో బతుకమ్మ సంబరాలు

కొత్తగూడెం, అక్టోబర్ 18: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను కొత్తగూడెం ఐడీఓసీ కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు, మహిళల ఆటపాటలతో కార్యాలయ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

ఈ వేడుకల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. వేణుగోపాల్, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ఎం. విద్యాచంద్ర పాల్గొన్నారు. టీజీవో సంఘం నాయకులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు ఉత్సాహంగా బతుకమ్మ సంబరాల్లో భాగస్వాములయ్యారు.

కార్యక్రమంలో టీజీవో నాయకులు ఏలూరు శ్రీనివాస్, బి. శ్యామ్, రాష్ట్ర కార్యదర్శి సంగం వెంకట పుల్లయ్య, జిల్లా అధ్యక్షురాలు జె. సుజాత, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి పి. నీరజ, రాష్ట్ర మహిళా విభాగం అదనపు కార్యదర్శి బి. అనూష పాల్గొన్నారు. జిల్లా పంచాయతీ అధికారి పద్మావతి, జిల్లా రెవెన్యూ అధికారి స్వర్ణలత లెనినతో పాటు పలువురు అధికారులు, ఉద్యోగులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, దసరా పండుగ సందర్భంగా ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, ప్రకృతిపై ప్రేమకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులందరూ ఐకమత్యంతో ముందుకు సాగుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. సంప్రదాయాలను కాపాడుతూ పండుగలను సమష్టిగా నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. పూల బతుకమ్మలు, సంప్రదాయ పాటలు, ఆటపాటలతో వేడుకలు సందడిగా సాగాయి.

– రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రిపోర్టర్

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :