రైతులు ఒక సీజన్ పంట సాగును వాయిదా వేసుకోవాలి.. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తలెత్తే వర్షాభావం, నీటి ఎద్దడి, విద్యుత్ కొరత వంటి సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజలంతా సహకరించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రైతులు పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకుని ఎండాకాలంలో పంటల సాగును తగ్గించుకోవాలని, అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ పొదుపుగా వినియోగించాలని సూచించారు. ఈ ప్రకృతి విపత్తును ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, సాగునీరు, తాగునీటి లభ్యత, విద్యుత్ సరఫరా, వ్యవసాయ రంగంపై పడే ప్రభావం తదితర అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
దసరా తర్వాత అఖిలపక్ష సమావేశం
ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే పరిస్థితులపై దసరా పండుగ తర్వాత అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల సలహాలు, సూచనలు తీసుకుని భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. నవంబర్ మొదటి వారంలో అఖిలపక్ష ప్రతినిధి బృందంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రాష్ట్రానికి అవసరమైన సహకారం కోరనున్నట్లు చెప్పారు.
ప్రకృతి విపత్తు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అదనపు విద్యుత్ కేటాయింపులు, ప్రకృతి విపత్తుల నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
రైతులు పంటల సాగుపై ఆచితూచి వ్యవహరించాలి
రాష్ట్రంలో నీటి లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో రైతులు పంటల సాగుపై అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. నీటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా వరి పంటలు సాగు చేస్తే నీరు అందించలేని పరిస్థితులు ఏర్పడి పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. దీనివల్ల రైతులు పెట్టుబడులు కోల్పోవడంతో పాటు మోటార్లు, విద్యుత్ పరికరాలు దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సీజన్ పంట సాగును వాయిదా వేసుకుని అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని రైతాంగానికి విజ్ఞప్తి చేశారు. రైతులకు నష్టం కలగకుండా, చేతికొచ్చిన పంటను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని తెలిపారు.
రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గుముఖం
గత ఏడాది ఇదే సమయానికి రిజర్వాయర్లలో సుమారు 462 టీఎంసీల నీరు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం దాదాపు 200 టీఎంసీల నీరు మాత్రమే ఉందని ముఖ్యమంత్రి వెల్లడించారు. అందుబాటులో ఉన్న నీటిని రాబోయే నెలల్లో, ముఖ్యంగా జూన్ వరకు జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలోని సుమారు 24 వేల గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉందని, నీటి ఎద్దడి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలు కూడా నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని కోరారు.
విద్యుత్ వినియోగం పెరుగుదలతో సవాళ్లు
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని సీఎం తెలిపారు. గత మూడేళ్లలో సగటు విద్యుత్ వినియోగం సుమారు 15 వేల మెగావాట్లుగా ఉండగా, ప్రస్తుతం 20 వేల మెగావాట్లకు చేరుకుందని వివరించారు. 2014-15లో సుమారు 6,500 నుంచి 7,000 మెగావాట్లుగా ఉన్న వినియోగం ఇప్పుడు భారీగా పెరిగిందన్నారు.
విద్యుత్ ఉత్పత్తి కంటే వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి, కేంద్ర విద్యుత్ పూల్ ద్వారా అదనపు విద్యుత్ పొందేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రైతులకు, పరిశ్రమలకు సాధ్యమైనంత మేరకు నిరంతర విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ఉపాధి హామీతో కూలీలకు భరోసా
ఈ సంక్షోభం రైతులకే కాకుండా భూమిలేని నిరుపేద కూలీలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈసారి సుమారు 2.5 లక్షల మంది ఉపాధి హామీ పనులకు వచ్చే అవకాశం ఉన్నందున, వారికి ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సంబంధిత మంత్రికి సూచించినట్లు వెల్లడించారు.
పంటల సాగును వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితుల్లో రైతులకు, వ్యవసాయ కూలీలకు ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు.
పశువులకు గ్రాసం, తాగునీటిపై ప్రత్యేక దృష్టి
తీవ్రమైన ఎండలు, నీటి కొరత నేపథ్యంలో పశువులకు గ్రాసం, తాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఎండల కారణంగా ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఎదురైతే, ముఖ్యంగా నిరుపేదలకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు.
తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు
ఎల్‌నినో పరిస్థితులపై ప్రజలు అపోహలకు గురికావద్దని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రజలకు నిరంతరం సరైన సమాచారం అందించేందుకు ప్రత్యేక నోడల్ అధికారిని నియమించినట్లు తెలిపారు. టోల్‌ఫ్రీ నంబర్‌తో వార్‌రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, అధికారిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తామని చెప్పారు.
ఈ విపత్తు పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో సబ్‌కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజలకు అధికారిక సమాచారం అందించే బాధ్యతను సీఎం సలహాదారు కే. రామకృష్ణారావుకు అప్పగించినట్లు తెలిపారు.
అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాలి
ఎల్‌నినో ప్రభావం వ్యవసాయం, తాగునీరు, విద్యుత్, పరిశ్రమలు, ప్రజల రోజువారీ జీవనంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రకృతి విపత్తును సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రజలందరి సహకారం అవసరమని స్పష్టం చేశారు.









